అధికారులపై అనుచిత తీరు అభ్యంతరకరం - టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గురువారం మధ్యాహ్నం ఏసీబీ కార్యాలయం నందు ఎమ్మెల్యే రాచమల్లు అధికారులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, అధికారం చేతుల్లో పెట్టుకుని శాసనసభ ద్వారా చట్టాలు మార్చగల ప్రభుత్వం, ఇలా అధికారులపై దుర్భాషలాడటం తప్పు అని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రొద్దుటూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాచమల్లు తీరు రాష్ట్రవ్యాప్తంగా సర్వత్ర చర్చనీయాంశంగా మారిందని, అధికారులు కూడా ముక్కును వేలేసుకునే విధంగా అభద్రతాభావాన్ని కల్పిస్తూ చేసిన వ్యాఖ్యలు, తీవ్ర పదజాలం ఉపయోగించి ముద్దాయిని బయటికి తీసుకు వచ్చిన తీరును ఆయన తప్పు పట్టారు. అధికారులను తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా, వైసీపీ ప్రభుత్వాన్నే ఎమ్మెల్యే తప్పు పట్టారని, మద్యపాన విధానాన్ని అమలు చేసింది వైసీపీ ప్రభుత్వమేనని, ఇది ఎమ్మెల్యే రాచమల్లు మరిచారా అని ప్రశ్నించారు? గడచిన సంవత్సరాలుగా ఉన్న పాలసీని తప్పు పడితే ఎలాగాని, ఎస్పీ స్థాయి అధికారిని ఎమ్మెల్యే రాచమల్లు దుర్భాషలాడుతుంటే పోలీసు సంఘాలు ఏమి చేస్తున్నాయి? అంటూ, ఇప్పటికైనా ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలపై పోలీసు సంఘాలు స్పందించి, తక్షణం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకనైనా చట్ట పరిధిలో పనిచేస్తున్న అధికారులకు స్వేచ్ఛను కల్పించాలని వారిపై బెదిరింపులకు పాల్పడకూడదని హితువు పలికారు. ఈ సంఘటనపై వెంటనే ప్రొద్దుటూరు ఏ.ఎస్.పి, ఎన్నికల సంఘానికి, అలాగే ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments