టీడీపీ-జనసేన కమిటీ భేటీ-100 రోజుల ప్లాన్, పై చర్చ
విజయవాడ:ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్ష టీడీపీ-జనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి కమిటీ ఇవాళ రెండోసారి భేటీ అయింది. విజయవాడలోని నోవోటెల్ హోటల్లో జరుగుతున్న ఈ భేటీకి ఇరు పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు. ఈ భేటీలో రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇందులో కరువు,వర్షాభావ పరిస్థితులు పై చర్చిస్తున్నారు. అలాగే మ్యానిఫెస్టో రూపకల్పన లోపు ఉమ్మడి కరపత్రంతో ముందుకెళ్లడంపై చర్చ జరుగుతోంది.
విజయవాడలో జరుగుతున్న భేటీకి టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య హాజరుకాగా... జనసేన తరఫున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస యశస్వి, మహేందర్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయికర్ వచ్చారు. ఈ భేటీలో త్వరలో చేపట్టబోయే 100 రోజుల ప్లాన్ అమలుపై నేతలు చర్చిస్తున్నారు..
మరోవైపు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుతో వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఇరు పార్టీల నేతల మధ్య సమన్వయం కోసం రాష్ట్రస్ధాయిలో ఉమ్మడి కమిటీ సమావేశం నిర్వహించారు.. అనంతరం జిల్లా స్ధాయిలో సమావేశాలు నిర్వహించారు. అవి కూడా పూర్తయ్యాయి. దీంతో ఇప్పుడు నియోజకవర్గాల స్ధాయిలో సమావేశాల నిర్వహణ కోసం ఇవాళ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇవి కూడా పూర్తయితే మండల స్ధాయిలోనూ ఇలాంటి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు ఇరు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.
అలాగే ఇరు పార్టీల తరఫున ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో వాటిపై కసరత్తు జరుగుతోంది. ఆలోపు ఇరు పార్టీల తరఫున ఉమ్మడి కరపత్రం ఒకటి రిలీజ్ చేయాలని టీడీపీ-జనసేన భావిస్తున్నాయి. దీనిపై ఇవాళ క్లారిటీ రానుంది..
Comments