టిడిపి హయాంలోనే ముస్లిముల అభివృద్ధి - చౌకబారు ప్రకటనలు మానుకోవాలి - టిడిపి నాయకులు
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
తెలుగుదేశం పార్టీ హయాంలోనే ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, రాజంపేట వైసీపీ నాయకులు, కార్యకర్తలు చౌకబారు ప్రకటనలు మానుకోవాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్, మైనారిటీ నాయకులు వైసీపీ నాయకుల పై ధ్వజమెత్తారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి భత్యాల చెంగలరాయుడు రంజాన్ పర్వదినాన స్థానిక ఈద్గా మైదానానికి వెళ్లి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టిడిపి హయాంలో ముస్లింలకు జరిగిన అభివృద్ధి పై ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు బత్యాలపై పత్రికలలో చేసిన అసత్యపు ఆరోపణలను ఖండిస్తూ సోమవారం టిడిపి కార్యాలయంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్ ఆధ్వర్యంలో టిడిపి ముఖ్య నాయకుల తో పాటు ముస్లిం మైనారిటీ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈద్గా మైదానం 2014 టిడిపి హయాంలో నాటి తెలుగుదేశం ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు చేసి సాధించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి తన పేరిట ముద్రించుకున్న ఆదర్శ ప్రజాపతి అన్న పుస్తకంలో కూడా ప్రస్తావించడం జరిగిందని అన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ముస్లిం మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన మేలు గురించి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లి విజయమ్మ విశాఖపట్నం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసిందని, బత్యాలను స్థానికుడు కాదని అనడం హాస్యాస్పదం అని అన్నారు. స్థాయి మరచి., రాష్ట్రస్థాయి నాయకుడి పై అవాకులు, చవాకులు పేలడం సరి కాదని అన్నారు. బత్యాలకు రాజంపేటలో ఓటు హక్కుతో పాటు ఇల్లు కూడా ఉందని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి చేసిన వాగ్దానాలను అమలు చేసే దిశగా ప్రయత్నం చేయాలని, చౌకబారు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు, పట్టణ కార్యదర్శి అబూబకర్, మైనారిటీ విభాగం పట్టణ అధ్యక్షులు మన్నూరు పీరు సాహెబ్, ప్రధాన కార్యదర్శి ఎస్.కె కరీం, మండలి ప్రధాన కార్యదర్శి కేశవ, మైనారిటీ విభాగం ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ మా భాష, సయ్యద్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
Comments