సీఎం జగన్ జిల్లా పర్యటనను అడ్డుకుంటాం
ప్రజలను మరోసారి మోసం చేయడానికే ఉక్కు ఫ్యాక్టరీకి భూమి పూజలు
తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జియా ఉద్దీన్.
ప్రొద్దుటూరు ఫిబ్రవరి 14
రాష్ట్ర యువతకు మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారం చేపట్టిన మొదటి సంవత్సరమే కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోగా మరోసారి భూమి పూజ అంటూ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో అడ్డుకుంటామని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు హెచ్చరించారు
ఈ సందర్భంగా మంగళవారం ఆయన పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్ర ప్రజలకు మోసపూరిత వాగ్దానాలతో అధికారం చేపట్టి మూడు సంవత్సరాల మూడు నెలల నెలలైనా ఒరగబెట్టిందేమీ లేదన్నారు. సీఎం సొంత జిల్లా వాసి కావడంతో జగన్ మాయమాటలు నమ్మి జిల్లాలో ప్రజలు 10కి 10 అసెంబ్లీ స్థానాలను కట్టబెట్టారన్నారు.
జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడం తప్పనిసరి అన్నారు కానీ సీఎం జగన్ అధికారం చేపట్టిన మొదటి సంవత్సరం 2019 డిసెంబర్లో కన్యతీర్థం సమీపంలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి మూడున్నర ఏళ్లయినా కనీసం ప్రహరీ గోడ నిర్మించలేకపోయారని విమర్శించారు. అలాంటి ముఖ్యమంత్రి తిరిగి నేడు ఉక్కు ఫ్యాక్టరీకి భూమి పూజ చేయడం మరోసారి ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు.
అధికారం చేపట్టిన అనంతరం శిలాఫలకం వేసి అధికారం కోల్పోయే ముందు మరోసారి భూమి పూజ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు పర్యటిస్తున్న సీఎం జగన్ జిల్లా పర్యటన ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని అడ్డుకుంటామని తెలిపారు. ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జియావుద్దీన్, తెలుగు యువత నాయకులు యమ్మనూరు ఆంజనేయులు, పల్లా సాయిరాం, ప్రొద్దుటూరు మండలం ఉపాధ్యక్షుడు షరీఫ్ లు ఉన్నారు.
Commenti