లౌకిక విధానం మతసామరస్యం కాపాడటమే టిడిపి విధానం - వరద
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
స్థానిక రాజకీయాలలో ముస్లింల పాత్ర అవగాహన సదస్సు, ముస్లిం ఆత్మీయ సమావేశం కొర్రపాడు రోడ్డులోని పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ప్రొద్దుటూరు పట్టణ టిడిపి మైనారిటీ అధ్యక్షులు ఎస్ఎం భాష అలాగే వైయస్ మహమ్మద్ గౌస్, షేక్ మునీర్, బేపారి జాకీర్ అహ్మద్ షేక్, ఖలీల్ భాషా, టిడిపి ముస్లిం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి పార్టీలు బలపరిచిన టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఆయన కుమారుడు యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి, వియస్ ముక్తీయార్ హాజరయ్యారు. బాబు పే భరోసా, ముస్లిం కా నారా చంద్రబాబు హమారా అనే నినాదంతో జగన్ కో హఠావో ఏపీకో బచావో అని పిలుపునిచ్చారు పలువురు ముస్లిం నాయకులు. ఈ సందర్భంగా టిడిపి యువ నాయకులు కొండారెడ్డి మాట్లాడుతూ, టిడిపి సెక్యులర్ విధానాన్ని అవలంబిస్తోందని, ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వ పాలనలో ముస్లిం సమాజం మోసానికి దగాకు గురైందని ఆవేదన వ్యక్తం చేస్తూ, నియోజకవర్గంలో అలాగే కడప జిల్లా నందు పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ముస్లిం యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం రానున్న టిడిపి ప్రభుత్వ హయాంలో తాము కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గడచిన టిడిపి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అభివృద్ధిని సంక్షేమ పథకాలు వివరిస్తూ, 45244 మంది పేద ముస్లిం లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీతో కూడుకున్న 2 లక్షల వరకు రుణాలు ఇప్పించామని, నాడు రాష్ట్ర నూర్ భాషా ఫెడరేషన్ స్థాపించి 50 కోట్ల రూపాయలు గ్రాంట్ అందించి, పేద ముస్లిం విద్యార్థినీ విద్యార్థుల విద్యావ్యాప్తి కోసం అనేక ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం, గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, ఐఐటి, పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు, విదేశాలలో విద్య చదువుకునే అవకాశం కల్పిస్తూ ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఆర్థికపరమైన సహకారం అందించడం జరిగిందని, దుల్హన్ పథకం కింద 38,500 మందికి 50వేలు చొప్పున వివాహాలకు ఆర్థిక సహకారాన్ని అందించామని, 5వేల మంది ఇమామ్లకు 5వేల రూపాయల చొప్పున మౌజన్ లకు 3000 రూపాయల చొప్పున ప్రతినెలా గౌరవ వేతనాన్ని ఇచ్చి ఆదుకున్నామని తెలిపారు.
టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వి.ఎస్ ముక్తియార్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీ వర్గాలపై హత్యలు, దాడులు, మానభంగాలు, ఆత్మహత్యలు, అందుకు దారి తీసిన వేధింపులను గుర్తు చేస్తూ రాష్ట్రంలో అలాగే నియోజకవర్గంలో వైసిపి పాలనపై విరుచుకుపడ్డారు.
అనంతరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి, నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ, ఏ పార్టీ అయినా తన మనుగడ కొనసాగించాలంటే ముస్లిం మైనారిటీల పాత్ర తప్పకుండా ఉండాలని, వారి సహాయ సహకారాలతోనే ఏ పార్టీ అయినా ముందుకు వెళుతుందని అభిప్రాయపడ్డారు. టిడిపి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మైనారిటీ సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేయకుండా రద్దుచేసి ముస్లింలను వైయస్సార్సీపి ప్రభుత్వం దగా చేసిందని అన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా దేశ సార్వభౌమత్వం, భద్రతను కాపాడుతూ, దేశ ప్రతిష్టతను ఇనుమడింపజేసి లౌకిక విధానంలో మత సామరస్యం, శాంతియుత సోదర భావంతో కూడుకున్న కులాలకు, మతాలకు అతీతంగా సమసమాజం స్థాపించటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని అన్నారు. 1982 నుండి నేటి వరకు 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్ర గమనిస్తే లౌకిక విధానాలకు కట్టుబడి మత సామరస్యం పెంపొందించడంలో అగ్రగామిగా నిలిచింది అనే సత్యం తేటతెల్లం అవుతుంది తెలిపారు.
కావున ఈ ఎన్నికలలో కడప ఎంపీ అభ్యర్థిగా చదివిరాళ్ల భూపేష్ రెడ్డి అలాగే నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా తనను ఆదరించి మైనారిటీలందరూ టిడిపికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో చదిపిరాళ్ల రాంగోపాల్ రెడ్డి, జనసేన నాయకులు జిలాన్, టిడిపి నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి, పలువురు మైనారిటీలు పాల్గొన్నారు.
Comments