వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
శుక్రవారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో సంక్షోభం మొదలైందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 2300 మంది లబ్ధిదారులకు పెన్షన్ నిలుపుదల నోటీసులు అందాయని, ఇదే జరిగితే రానున్న రోజుల్లో తాను తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తానని హెచ్చరించారు. తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని ఆయన కోరారు. ఇదే సందర్భంలో గురువారం నాడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ లపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ప్రజా సమస్యలపై పోరాడే దిశగా, సమస్యలపై త్వరలో శంఖారావం పూరించనున్నట్లు, ఇందుకుగాను జనవరి 2023 నుండి ఇంటింటికి తెలుగుదేశం, ఇదేం కర్మ మొదలగు కార్యక్రమాల ద్వారా నియోజకవర్గ ప్రజల ముందుకు రానున్నట్లు ఆయన వెల్లడించారు. పట్టణంలో శాంతిభద్రతలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, నియోజకవర్గ వైసిపి అసమ్మతి వర్గ నాయకులకు టిడిపి ఆహ్వానం పలుకుతోందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్, పట్టణ అధ్యక్షుడు ఈవి సుధాకర్ రెడ్డి, తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు, టిడిపి నాయకులు కుతుబుద్దిన్, తాటి శ్రీనివాసులు, సిద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments