తల్లికి గుడి కట్టిన కొడుకు.!
పురాణాల్లో శ్రవణ కుమారుడు అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోసి పుణ్యక్షేత్రాలను తిప్పితే... ఆమదాలవలస మండలంలోని చీమలవలసకు చెందిన సనపల శ్రవణ్ కుమార్ కన్నతల్లికి ఏకంగా ఆలయాన్నే కడుతున్నాడు. అదీ మామూలుగా కాకుండా రాతితో కడుతుండడం విశేషం. శ్రవణ్ కుమార్ తల్లి అనసూయ దేవి 2008లో మరణించారు. ఆమె జ్ఞాపకాలను మరిచిపోలేని శ్రవణ్... ఏకంగా ఆలయాన్నే నిర్మించాలనుకున్నాడు. వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన ఆయన గ్రామానికి వచ్చి 2018లో గుడి నిర్మాణానికి పూనుకున్నారు. ఆ సమయంలో తెలంగాణలోని యాదాద్రిలో రాతితో గుడిని నిర్మిస్తున్న విషయాన్ని తెలుసుకుని అక్కడకు వెళ్లి అధ్యయనం చేసి అమ్మకు గుడిని అద్భుతంగా కట్టాలని నిర్ణయించుకున్నాడు.
వందల ఏళ్లు మన్నికగా ఉండడానికి రాతిబంధనం విధానంతో గరుడ సున్నం, కరక్కాయ, బెల్లం, కొబ్బరి పీచు, తుమ్మ బంక, ఇసుకను యంత్రంలో మిశ్రమం చేసి నెల రోజుల పాటు పులియబెట్టి ఆ మిశ్రమంతో గుడి కడుతున్నారు. తమిళనాడు, ఒడివా రాష్ట్రాల నుంచి శిల్పులను తీసుకొచ్చి ఏకకృష్ణ శిలలపై శిల్పాలు చెక్కిస్తున్నారు. అక్కడితో ఆగక అమ్మ దేవస్థానం పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను శ్రావణ్ కుమార్ చేపడుతున్నారు.
ఇందులో భాగంగా ఈనెల నాలుగో తేదీన అమ్మ దేవస్థానం ఆవరణలో నిరుద్యోగుల కోసం జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక జిల్లావాసులు పడుతున్న ఇబ్బందులను గమనించి జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు శ్రవణ్ కుమార్ తెలిపారు. ఆలయ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మూడు కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాల భర్తీని చేపడతాయని చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అమ్మ దేవస్థానం ఆధ్వర్యాన భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి, సేవా కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడతామన్నారు.
Comments