top of page
Writer's pictureEDITOR

పౌరుల నిర్లక్ష్యమే మోసాలకు ప్రోత్సాహకం - స్పీకర్

పౌరుల నిర్లక్ష్యమే మోసాలకు ప్రోత్సాహకం


శ్రీకాకుళం, డిసెంబరు 24 : పౌరుల నిర్లక్ష్యమే మోసాలకు ప్రోత్సాహకంగా ఉందని రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జాతీయ వినియోదారుల దినోత్సవం బాపూజీ కలామందిర్ లో శుక్ర వారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పీకర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. స్పీకర్ మాట్లాడుతూ వినియోగదారుల చట్టంలో అంశాలను అమలు చేస్తూ, పారదర్శకంగా తెలియజేయాలన్నారు. ఆహార నియంత్రణ శాఖ, తూనికలు కొలతల శాఖ, ఔషద నియంత్రణ తదితర శాఖలు బహిరంగంగా ఉండాలని, పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రతి దుకాణంలో ఫోన్ నంబర్లు అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. మన ఆలోచనలు కల్తీ అవుతున్నాయని ఆయన చెప్పారు. మితిమీరిన లాభాలు ఆశిస్తూ కాలం చెల్లిన పదార్థాలు, వస్తువులు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇది పెద్ద సమస్యగా పరిగణించవలసిన అంశం అన్నారు. వినియోగదారులు బిల్లులు తీసుకోవాలని స్పీకర్ చెప్పారు. చట్టాల అమలును అదికార యంత్రాంగం చిత్తశుద్ధితో చేపట్టాలని ఆయన అన్నారు. వీటిని పాఠ్యాంశాలుగా చేర్చాలని, ముఖ్య మంత్రికి సూచన చేస్తామని ఆయన తెలిపారు. బాల్యం నుంచే అవగాహన పెంపొందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆహార నియంత్రణ అధికారులు, ఔషధ నియంత్రణ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. వసతి గృహాల్లో ఆహార కల్తీ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. పౌరుల నిర్లక్ష్యమే మోసాలకు ప్రోత్సాహకంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని పిలుపు నిచ్చారు. పౌరులను చూస్తే వస్తు, సేవలు అందించేవారికి భయం కలగాలని ఆయన తెలిపారు. యువత తమ హక్కులను గమనించాలని కోరారు.


జాయింట్ కలెక్టర్ ఎం.విజయ సునీత మాట్లాడుతూ వస్తు, సేవలు పొందే ప్రతి ఒక్కరూ వినియోగదారు అన్నారు. కొనుగోలు చేసినప్పుడు బిల్లులు విధిగా పొందాలని ఆమె చెప్పారు. ప్రకటనల ఉచ్చులో పడకుండా నాణ్యత పరిశీలించు కావాలని కోరారు. ఆన్ లైన్ మోసాలు జరుగుతున్నాయి, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపు నిచ్చారు. వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని సూచించారు. వినియోగదారుల సంఘాలు అవగాహన కల్పించాలని ఆమె పేర్కొన్నారు.


జిల్లా వినియోదారుల సమాఖ్య అధ్యక్షులు బగాది రామ్మోహనరావు మాట్లాడుతూ వినియోదారుల కోర్టుకు భవనం మంజూరు చేయాలన్నారు. వినియోగారుల ఉద్యమం బలోపేతం కావాలని ఆయన అన్నారు. అడిగినా అడక్కపోయినా బిల్లు విధిగా ఇవ్వాలని ఆయన చెప్పారు. ఔషద దుకాణాల్లో విధిగా ఫార్మసీస్టు ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. వివిధ విభాగాల్లో వినియోగదారుల కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.


ఆహార నియంత్రణ శాఖ సహాయ కంట్రోలర్ కే.వి.రత్నం మాట్లాడుతూ స్వీట్ లపై తయారీ తేదీ, కాలం చెల్లే తేదీలను విధిగా ప్రచురించాలన్నారు. ఒకసారి వినియోగించిన వంట నూనె తిరిగి ఉపయోగించరాదని వాటిపై తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిషేధిత రంగులు వినియోగిస్తున్నారని తెలిపారు.


తూనికలు కొలతల శాఖ సహాయ కంట్రోలర్ యస్.విశ్వేశ్వర రావు మాట్లాడుతూ పెట్రోల్ బంకులలో పెట్రోల్ నాణ్యత పరిశీలించే హక్కు వినియోగదారులకు ఉందన్నారు. పెట్రోల్ బంకుల్లో సున్నా కొలత చూడాలని, కొలతల్లో తేడాలు ఉన్నట్లు గమనించుటకు బంకుల్లో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఐదు లీటర్ల కేన్ తో పరిశీలించ వచ్చని చెప్పారు. ఇథనాల్ తో పెట్రోల్ కలిస్తే నీరులా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లాలో 7 వందల కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. రూ.24 లక్షలు అపరాధ రుసుము విధించామని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ఆహార నియంత్రణ శాఖ, తూనికలు కొలతల శాఖ, ఔషద నియంత్రణ శాఖ, దేవి ప్రసాద్ గ్యాస్ ఏజెన్సీ ఆయా అంశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించుటకు ప్రదర్శన శాలలు ఏర్పాటు చేశాయి. వీటిని స్పీకర్ పరిశీలించారు. ఎం.డీ.యు వాహనం ద్వారా బియ్యాన్ని సరఫరా చేశారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుతులు పంపిణీ చేసారు.


ఈ కార్యక్రమంలో విశ్రాంత జిల్లా న్యాయమూర్తి పప్పల జగన్నాథ రావు, జిల్లా సరఫరాల అధికారి డి.వి.రమణ, పౌర సరఫరాల సంస్థ డి.ఎం పి.జయంతి, డి.ఎం.హెచ్.ఓ బి. జగన్నాథ రావు, ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు నాగ కిరణ్ కుమార్, ఆహార నియంత్రణ శాఖ ఆహార తనిఖీ అధికారి కె. కూర్మ నాయకులు, వినియోగదారుల సంఘం ప్రతినిధులు బుడుమురు శ్రీరామమూర్తి, తదతరులు పాల్గొన్నారు.




1 view0 comments

Comentarios

Obtuvo 0 de 5 estrellas.
Aún no hay calificaciones

Agrega una calificación
bottom of page