టిడ్కో ఇళ్లకు చెల్లించిన సొమ్మును తిరిగి లబ్ధిదారులకు పంపిణీ
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఇల్లు లేని నిరుపేదలకు జీ టైపు ఇళ్లను టిడ్కో ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వ నిబంధనల మేరకు గృహ నిర్మాణానికి లబ్ధిదారులు చెల్లించిన సొమ్మును ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా తిరిగి శుక్రవారం లబ్ధిదారులకు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ గత టిడిపి పాలనలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని మూడు రకాలుగా లబ్ధిదారుల నుండి అడ్వాన్స్ డబ్బులు టీడీపీ ప్రభుత్వం వసూలు చేసింది అన్నారు.
ఆనాడే లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి ప్రభుత్వ విధానాలను వివరించామని, తనపై నమ్మకంతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుమారు 5000 మంది ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా అందులో 903 మంది మాత్రమే గృహ నిర్మాణాల కొరకు డబ్బులు చెల్లించారన్నారు, కానీ గత ప్రభుత్వం ఇల్లు నిర్మించలేక మధ్యలోనే నిలబెట్టి లబ్ధిదారులకు మోసం చేసిందని, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే లబ్ధిదారులకు వారు కట్టిన డబ్బులు తిరిగి చెల్లిస్తామని నాడు వాగ్దానం చేసిన నేపథ్యంలో, శుక్రవారం ఒక కోటి పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల రూపాయల చెక్కులను పంపిణీ చేసి మాట నిలబెట్టుకోవడం తనకు సంతోషకరంగా ఉందన్నారు.
అలాగే వారందరికీ ఇంటి పట్టాతో పాటు ఇంటి నిర్మాణానికి ఒక లక్ష ఎనబై వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తామని కేవలం ముప్పై అయిదు వేల రూపాయలు చెల్లిస్తే ఇంటి నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇల్లు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు తిరిగి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, కమీషనర్ వెంకటరమణయ్య, కౌన్సిలర్లు వరికూటి ఓబులరెడ్డి, నాగేంద్రా రెడ్డి, షేక్ కమల్ భాష, కో ఆప్షన్ సభ్యులు మల్లికార్జున యాదవ్, వైసీపీ నాయకులు షేక్ నూరి తదితరులు పాల్గొన్నారు.
Комментарии