టీడీపీ వర్సస్ వైసీపీ 23న... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గెలిచేది ఎవరు? రెబల్స్ ఓట్లు ఎవరికి?
ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. మరో ఎన్నికకు రంగం సిద్దమవుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ.. పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయం సాధించాయి. ఈ నెల 23న అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసారు. ఏకగ్రీవమనే అభిప్రాయం వ్యక్తం అయింది. చివరి నిమిషంలో టీడీపీ తమ అభ్యర్ధిని రంగంలోకి దించింది. పంచుమర్తి అనురాధ పోటీలో నిలిచారు. ఇప్పుడు రెండు పార్టీలు రెబల్స్ పైనే ఆశలు పెట్టుకున్నాయి. రెండు పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. దీంతో, ఈ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక
మొత్తం ఏడు స్థానాలకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యబలం ఆధారంగా ఒక్కో అభ్యర్ధి గెలుపుకు 22 ఓట్లు అవసరం అవుతాయి. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇద్దరు ఆనం..కోటంరెడ్డి ఇద్దరూ వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తారా లేదా అనేది సందేహమే. జనసేన నుంచి గెలిచిన రాపాకతో పాటుగా టీడీపీ నుంచి గెలిచిన వారిలో నలుగురు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఈ 154 మంది వైసీపీ నిర్ణయించిన విధంగా తమకు కేటాయించిన అభ్యర్ధులకు ఓటు వేస్తే వైసీపీ నుంచి బరిలో నిలిచిన ఏడుగురు గెలిచే అవకాశం ఉంది. ప్రతీ ఓటు కీలకంగా మారుతోంది. అదే సమయంలో పోలింగ్ సమయానికి అనూహ్య పరిణామాలు చూస్తారని..వైసీపీ ఏడుగురు అభ్యర్దులు గెలుస్తారని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు
వైసీపీ రెబల్స్ పై టీడీపీ ఆశలు
టీడీపీకి సాంకేతికంగా సభలో 23 మంది సభ్యుల మద్దతు ఉంది. అందులో నలుగురు ఎమ్మెల్యేలు (వాసుపల్లి గణేశ్, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం) ఇప్పుడు వైసీపీతో ఉన్నారు. తమకు నలుగురు దూరమైనా వైసీపీ లో ఇప్పటికే ఇద్దరు రెబల్స్ తమకు అనుకూలంగా ఓటింగ్ చేస్తారని టీడీపీ విశ్వసిస్తోంది. ఇప్పటికే ఆ ఇద్దరిని వైసీపీ తమ లెక్క నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది. ఆనం..కోటంరెడ్డి తమ ఆత్మప్రభోధానుసారం ఓటు వేస్తామని చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థికి ఆ ఇద్దరూ ఓటేస్తే ప్రతిపక్షం బలం 21కి చేరుతుంది. మరొక్క ఓటు పడితే టీడీపీ గెలుస్తుంది. మరో ఎమ్మెల్యే మద్దతు కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో వైసీపీ కూడా గేమ్ మొదలు పెట్టింది. తమ క్యాంపు నుంచి ఎవరూ చేజారకుండానే...టీడీపీ అధినాయకత్వానికి షాక్ ఇచ్చే పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పటం ద్వారా రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది.
Comments