top of page
Writer's pictureMD & CEO

సింహ వాహనంపై అనంతతేజోమూర్తి

సింహ వాహనంపై అనంతతేజోమూర్తి

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం అనంతతేజోమూర్తి శ్రీ గోవిందరాజస్వామి సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

మృగాల్లో రారాజు సింహం. గాంభీర్యానికి చిహ్నం సింహం. యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికి, శీఘ్రగమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. స్వామివారు రాక్షసుల మనసులలో సింహంలా గోచరిస్తాడని స్తోత్రవాఙ్మయం కీర్తిస్తోంది.

అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

వాహనసేవలో కంక‌ణ బ‌ట్టార్ శ్రీ ఏపి శ్రీనివాస దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ రవి కుమార్, సూపరింటెండెంట్ శ్రీ మోహనరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయులు పాల్గొన్నారు.


11 views0 comments

Commenti

Valutazione 0 stelle su 5.
Non ci sono ancora valutazioni

Aggiungi una valutazione
bottom of page