రేషన్ బియ్యం పక్కదారి.
--అనుంపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద రెండు టెంపో ల బియ్యం(150 బస్తాలు) పట్టివేత.
--ఈజీగా చెక్ పోస్ట్ లు దాటుతున్న వైనం.
--శ్రద్ధ చూపితే తప్ప దొరకని అక్రమ రవాణా.
ప్రభుత్వం మీద భారంపడినా పేద ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రతి నెల అర్హులైన కుటుంబానికి అందించే రేషన్ బియ్యం కొందరి స్వాలాభార్జన పరుల చేతుల్లో చిక్కి పక్కదారి పడుతోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
పూర్తి వివరాల్లోకి వెళితే గత నాలుగు రోజుల ముందర రాజుకుంట క్రాస్ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద రేషన్ బియ్యం తో నిండిన మినీ లారీ పట్టుబడి కొద్ది రోజులు గడవక ముందే ఈరోజు ఉదయం అనుంపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పూర్తి లోడ్ తో నింపిన రెండు టెంపో లు రేషన్ బస్తాలతో పట్టుబడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఫారెస్ట్,రెవిన్యూ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి వెంకటగిరి కి తీసుకు వెళ్తున్నారని సుమారు 150 బస్తాలు ఉంటాయని వాహనాలు AP39 TL 8913 మరియు AP 39 TX2130 లుగా తెలిపారు. అయితే ఈరోజు ఆదివారం కావడంతో అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వారన్నారు.
దారిపొడవునా పోలీస్ చెక్ పోస్టులు, పోలీస్ పహారా, ఫారెస్ట్ చెక్ పోస్ట్ లు,అధికార యంత్రాంగం ఇలా ఎన్ని ఉన్నప్పటికీ... అందరినీ కన్నుగప్పి లేక చేతివాటం ప్రదర్శించి యదేచ్చగా తాము అనుకున్నది నిర్వహిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.
అయితే ఈ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి తరలిస్తున్న వ్యాపారస్తులు వాటిని మెషిన్ లో పాలిష్ చేసి సన్నబియ్యం గా సొమ్ము చేసుకోవడానికా..?? లేక వ్యక్తిగత అవసరాల కోసమా?? తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కేజీ 3 రూపాయలు కొని సుమారు 30 రూపాయల ధరకు అమ్ముకొని ఆదాయం పొందుతున్నారు అనడంలో సందేహం లేదు.
లారీలకు తరలించే సరుకు ఇంతఈజీగా దొరుకుతుందంటే వ్యాపారస్తులు మధ్యవర్తుల నుంచి పొందుతున్నారా?? డీలర్ల నుంచి పొందుతున్నారా?? లేక అధికారుల నుంచే డైరెక్ట్ గా పొందుతున్నారా?? అన్నది సందేహం. ఇంటింటికి తిరిగి 5, 10 కేజీలు సేకరిస్తే అమాంతం లారీని నింపి వేయలేం కదా?!!.
ఇప్పటికైనా అధికారులు, యంత్రాంగం మేల్కొని ప్రతి నెల రేషన్ సక్రమంగా పంపిణీ అయ్యేటట్లు ప్రజలకు సజావుగా అందేటట్లు చూడకపోతే ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ పథకం తప్పుదోవ పడుతోంది అన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లడానికి మరెంతో దూరంలో లేదని చెప్పకనే చెప్పవచ్చు.
Comentarios