ఘనంగా ఉదయగిరి ఎల్లమ్మ దేవస్థాన వార్షిక మహోత్సవం
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
రాజంపేట పట్టణం మన్నూరులో వెలసిన శ్రీశ్రీశ్రీ ఉదయగిరి ఎల్లమ్మ దేవస్థానంలో శుక్రవారం నిర్వహించిన ఆరవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 5 గంటల నుండి ఆలయ అర్చకులు నాగేంద్ర, మణికంఠలు ఎల్లమ్మ తల్లికి అభిషేకములు, పూజా కైంకర్యములు నిర్వహించారు. భక్తి శ్రద్దలతో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ ఆధ్యాత్మిక ఉపన్యాసం గావించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సరిహద్దులో ఉంటూ, ఎల్లజనులను కాచి, కాపాడే దేవత ఎల్లమ్మ అని పేర్కొన్నారు. భక్తితో కొలిచిన వారికి కొంగుబంగారమై కోరిన కోరికలను నెరవేర్చే గొప్ప దేవత ఎల్లమ్మ అని ఆయన చెప్పారు. భక్తిని గురించి, దేవుని గురించి, జన్మ రాహిత్యం గురించి మోక్ష సంబంధమైనటువంటి విషయాలను ఆయన ప్రస్తావించి ఆత్మజ్ఞాన సాధనకై ప్రతి భక్తుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సింగన వారి పల్లి, గొందివారిపల్లి బసి నాయుడు వారి పల్లెకు చెందిన మలిరెడ్డి వెంకటరమణ సుబ్బరాయుడు, దాసయ్య, గొంది బాబు వెంకటయ్య వెంకటేష్, కొల్లా సుబ్బరాయుడు, శంకరయ్య మరియు కువైట్ లో ఉన్న భక్తుల సహకారంతో సుమారు 2500 మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బత్యాలల చంగల్ రాయలు, ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.
留言