నకిలీ యాప్ ముఠా గుట్టురట్టు
ప్రతిరోజు వేలాది రూపాయల ఆదాయం ఆర్జించవచ్చంటూ జీవి ఫుట్ బాల్ యాప్ ప్రమోషన్ కు పాల్పడుతూ ప్రజలను మభ్యపెడుతున్న ఇరువురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
కడప నగరంలోని తన కార్యాలయ ఆవరణలో గల పెన్నార్ పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే రోజూ కమిషన్ తో పాటు కొద్ది రోజుల తర్వాత రెండింతలు సంపాదించవచ్చని ప్రజలకు ఎర వేసేవారన్నారు. జీవి ఫుట్ బాల్ యాప్ కు ఎటువంటి అనుమతులు లేవని తెలియజేశారు. ఈ యాప్ విషయంగా వచ్చిన ఫిర్యాదు సుమోటో కేసును రెండు రోజుల క్రితం నమోదు చేశామన్నారు.
ఈ కేసులో జీవి యాప్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్, ఈవెంట్లను జరుపుతున్న ఇద్దరు నిందితులను విచారణ చేసి ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేశామని వివరించారు. యాప్ ద్వారా ఆన్లైన్ గేమ్ లో డబ్బులు పెట్టి, సామూహిక డిన్నర్లను నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ కేసులో ఇంకా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పి హెచ్చరించారు.
నిబంధనల ప్రకారం త్వరలోనే విచారణ జరిపి అకౌంట్లను ఫ్రీజ్ కూడా చేస్తామన్నారు. ప్రజల దగ్గర ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు గానీ, డయల్ 100కు లేదా జిల్లా పోలీస్ కార్యాలయ 'స్పందన' వాట్సాప్ నెంబర్ 9121100704 కు ఫిర్యాదు చేయాలన్నారు. పెట్టుబడుల పేరిట ఆదాయం వస్తుందని నమ్మించే యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సీఐ నాగరాజు, ఎస్.ఐ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
תגובות