టీకాలు ద్వారా గాలికుంటు వ్యాధిని నిర్మూలిద్దాం
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
టీకాలు వేయడం ద్వారా గాలికుంటు వ్యాధిని నిర్మూలించి పాడి రైతుల ఆర్థిక ప్రగతిని సాధిద్దామని రాజంపేట డివిజన్ పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు అబ్దుల్ ఆరిఫ్ పేర్కొన్నారు. బుధవారం పెద్ద కారం పల్లె పంచాయతీ లోని ఉప్పరపల్లె, రాజంపేట పట్టణ పరిధిలో గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా అబ్దుల్ ఆరిఫ్ మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా బుధవారం 189 పశువులకు టీకాలు వేయడం జరిగిందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకడం వలన వ్యాధి సోకిన పశువుకు పాల దిగుబడి సామర్థ్యం తగ్గుతుందని, సకాలంలో ఎదకు రాకుండా చూళ్ళు నిలవడం కూడా జరగదని తెలిపారు. ఎండలోకి వెళ్ళిన వెంటనే పశువులు ఆయాసపడతాయని అన్నారు. డివిజన్ పరిధిలోని అన్ని మండలాలకు 56,800 డోసులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. వ్యాధి నివారణకు 100 శాతం టీకాలు వేయించుకోవాలని.. ఈ కార్యక్రమం ఈ నెల చివరి వరకు ఉంటుందని, ప్రతి పాడి రైతు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ కె.ప్రతాప్, జెవిఓ ఎం.వరదయ్య, ఆసుపత్రి అటెండెంట్ బి.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments