ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గపు చట్టం - వరద
కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఓటర్లు అన్ని విధాల ఆలోచన చేసి రాష్ట్రాన్ని ఏ పార్టీ అయితే అభివృద్ధి పథంలో నడిపిస్తుందో ఆ పార్టీకే 13వ తేదీ జరగనున్న ఎన్నికలలో ఓట్లు వేయాలని ఎన్డీఏ కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం స్థానిక నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వరద మాట్లాడుతూ, వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యమని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత అల్లాడుతుంటే, ప్రాజెక్టులు అటకెక్కించిన వైసిపి ప్రభుత్వం రైతాంగాన్ని కూడా పూర్తిగా నష్టపరిచారని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పార్టీ వైసిపి అని, రానున్న రోజులలో మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక్కడి రైతులు ఉపాధి హామీ పనులకు వెళ్ళవలసిన పరిస్థితి దాపురుస్తుందని హెచ్చరిస్తూ, అభివృద్ధిని పక్కనపెట్టి నవరత్నాలను నమ్ముకొని పరిపాలన చేసిన పార్టీగా వైసిపి పేరుగాంచిందని ఆయన అన్నారు.
రానున్న టిడిపి ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని, ఇది ఒక దుర్మార్గమైన చట్టంగా ఆయన అభిప్రాయపడ్డారు. వేల కోట్ల రూపాయల భూములను కాజేయడానికే ఈ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం రూపొందించిందని, కావున రైతులు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ అమలు చేస్తామన్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలలో అభివృద్ధికి పెద్దపీట వేసి సుపరిపాలన అందిస్తూ శాంతిని కాంక్షించే పార్టీకే ప్రజలు ఓట్లు వేయాలని అభ్యర్థించారు.
Comments