డబ్బులు అడిగినట్లు నిరూపిస్తే నామినేషన్ దాఖలు చేయను - వరద
వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
My hands are very clean, this is my challenge... ఎమ్మెల్యే రాచమల్లు గడచిన కొద్దిరోజుల క్రితం టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఆర్యవైశ్య వర్తకుల నుండి డబ్బులు డిమాండ్ చేశారు అంటూ చేసిన ఆరోపణపై, నంద్యాల వరదరాజుల రెడ్డి గురువారం సాయంత్రం నెహ్రూ రోడ్డులోని ఆయన కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి పై విధంగా స్పందించారు. గడిచిన 40 సంవత్సరాల తన రాజకీయ చరిత్రలో ఏనాడూ ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని, తన రాజకీయ జీవితం ప్రొద్దుటూరు ప్రజలకు తెరిచిన పుస్తకమని, ఏ వర్తకుడిని తాను డబ్బులు డిమాండ్ చేశానో రుజువు చేయగలిగితే ఈ ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేయనని సవాల్ విసిరారు. నియోజకవర్గ ప్రజలు తన పాలనను కోరుకుంటున్నారని, అందువలనే ఐవీఆర్ఎస్ ద్వారా 74 శాతం మంది ప్రజలు తనకు మద్దతు తెలిపిన కారణంగానే టిడిపి అధిష్టానం తనకు టికెట్ ఖరారు చేసిందని చెప్పారు. తాను కానీ తన కుమారుడు నంద్యాల కొండారెడ్డి గాని ఎక్కడ అవినీతికి పాల్పడలేదని, తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ప్రొద్దుటూరు ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనని, నియోజకవర్గ ప్రజలే తన ప్రాణమని అన్నారు. ఎల్లవేళలా ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటాను కాబట్టే ప్రజలు తనను కోరుకుంటున్నారని, ఏనాడు ఎమ్మెల్యే రాచమల్లు ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు. తన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ ఈ దఫా ఎన్నికలలో ప్రజలు తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తూ, నైతికంగా ప్రజలు ఎమ్మెల్యేగా రాచమల్లును ఎన్నుకునే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.
Comentários