వీరబల్లి పవర్ ప్రాజెక్ట్ తో ప్రజలకు భారమే - చమర్తి
రాజంపేట, వీరవల్లి పవర్ ప్రాజెక్టుతో ప్రజలకు, రైతులకు నష్టమేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీరబల్లి మండలంలో 1.170 టీఎంసీల నీటిని మాండవ్య నది నుంచి తీసుకొని ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ12,787 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వానికి ప్రాజెక్టు రిపోర్ట్ సమర్పించిందని అన్నారు. మాండవ్య నది ఒడ్డున ఒకటి, పాల కొండపైన మరొక రిజర్వాయర్ నిర్మించడం ద్వారా నీటిని పంపింగ్ చేసే క్రమంలో సైక్లింగ్ ప్రక్రియ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విద్యుత్ ఉత్పత్తి సమయంలో కనీసం 20 శాతం నీరు ఆవిరి అయిపోతుందని అన్నారు. ఈ 20% నీటిని కూడా తిరిగి మాండవ్య నది నుంచి తీసుకుంటారని పేర్కొన్నారు. దీనివల్ల మాండవ్య నదిలో అందుబాటులో ఉన్న నీరు ఈ పవర్ ప్రాజెక్టుకి సరిపోతుందని అన్నారు.
అందుబాటులో ఉన్న నీరంతా ప్రాజెక్టుకే ఉపయోగిస్తే ప్రజల అవసరాలకు, రైతుల పొలాలకు నీటిని ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. అసలు మాండవ్య నదిలో నీటి తలభ్యత ఎంత ? వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు నదిలో నీటి లభ్యత లేకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఏది ఏమైనా అంతిమంగా ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ ఉపయోగం ఉంటే పర్వాలేదు కానీ, నిరుపయోగమైన ప్రాజెక్టును నిర్మించడం దేనికని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితి ప్రాజెక్ట్ రిపోర్ట్ లో కనిపించడం లేదని.. విద్యుత్ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు అమ్ముకునేందుకు ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. కొందరు ప్రభుత్వ పెద్దలకు స్వప్రయోజనం చేకూరుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రజావ్యతిరేక ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర వ్యతిరేకత ప్రజల నుంచి ఉంటుందని తెలుసుకోవాలని హెచ్చరించారు .
ఈ ప్రాజెక్టు వల్ల అటవీ సంపదకు ప్రధానంగా ప్రపంచంలోనే అరుదైన సంపద ఎర్రచందనానికి ప్రమాదం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. రెండవ రిజర్వాయర్ నిర్మించే పాలకొండ లోని అటవీ ప్రాంతంలో యనమల చెరువు ,బావులు ఉన్నాయని., తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడితే తప్ప ఈ చెరువు, బావులు ఎండిపోవని అన్నారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల అడవుల్లోని వన్య మృగాలకు నీటి సమస్య కూడా తలెత్తుతుందన్నారు. ఈ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి 540 హెక్టార్ల రిజర్వు ఫారెస్టు పరిధిలోని భూములు అవసరం అవుతాయని ప్రాజెక్ట్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీనివల్ల స్మగ్లర్లకు ప్రయోజనం చేకూరే ప్రమాదం ఉందని, అలాగే రైతుల నుంచి మరో 700 ఎకరాల భూములు అవసరమని ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొని ఉన్నారని తెలిపారు. రైతుల సమ్మతి మేరకే భూములను సేకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జోక్యం ఉండకూడదని అన్నారు. ప్రైవేట్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాలకు ఏ మాత్రం విఘాతం కలిగినా, రైతులకు అన్యాయం జరిగినా న్యాయపోరాటం చేస్తానని ఈసందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ద్వారా రాష్ట్ర అవసరాలకు మించి ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. అటువంటప్పుడు వీరబల్లి ప్రాజెక్టు వ్యాపార ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. పర్యావరణం దెబ్బతినడంతో పాటు రైతాంగానికి కూడా నష్టం జరుగుతుందన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పవర్ ప్రాజెక్టు పై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జగన్ మోహన్ రాజు కోరారు.
Comments