విశాఖ ఉక్కు కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలని, అడహక్ ఎరియర్స్ చెల్లించాలని స్టీల్ ఉన్నత యాజమాన్యం దృష్టికి అనేక సార్లు తీసుకువెళ్లిన వారి నుంచి సరైన స్పందన రాని కారణంగా సమ్మె అనివార్యమని అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రతినిధులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలనే పోరాటంలో భాగంగా నేడు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ డి వర్క్స్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సి జి ఎం వర్క్స్ చక్రవర్తి గారికి వినతి పత్రం అందజేశారు.
ఈ ధర్నాను ఉద్దేశించి అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఈ సమస్య పరిష్కారానికి నేటి వరకు ఉన్నత యాజమాన్యం నుంచి సరైన స్పందన రాలేదని వారు తీవ్రంగా విమర్శించారు. ఎన్ జె సి ఎస్ లో భాగస్వామి మైన విశాఖ స్టీల్ ప్లాంట్ లో నేటివరకు ఉన్నత యాజమాన్యం ఆ అంశాలను పరిగణనలోకి తీసుకుని చిన్న చిన్న మార్పుల తో అంగీకరించడం సాంప్రదాయమని వారు అన్నారు. నేటి యాజమాన్యం ఆర్థిక ఇబ్బందులు పేరుతో బోర్డు ఆమోదానికి కూడా పంపకుండా తాత్సారం చేస్తోందని వారు వివరించారు. కార్మికుల అంకితభావంతో పని చేయడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం గడచిన 9 మాసాల్లో 19,370 కోట్ల అమ్మకాలు జరిగాయని, రాబోయే మూడు నెలల్లో 8500 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నారని వారు వివరించారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే కార్మికులను ప్రోత్సహించకుండా ఎలా సాధ్యం వారు ప్రశ్నించారు. సంప్రదింపులు, చర్చలు జరపవలసిన యాజమాన్యం నిస్సిగ్గుగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ కార్మికుల సహనాన్ని పరీక్షించడం తీవ్ర అభ్యంతరకరమని వారు స్పష్టం చేశారు. కనుక కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వారు హెచ్చరించారు.
స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు జె. అయోధ్య రామ్, మంత్రి రాజశేఖర్, డి ఆదినారాయణ, వై మస్తానప్ప, వి రామమోహన్ కుమార్, దొమ్మేటి అప్పారావు, రాధాకృష్ణ, డి వి రమణ రెడ్డి, డి సురేష్ బాబు, కె సత్య రావు, బి డేవిడ్, డి ఆనందరావు, జి ఆర్ కె నాయుడు, వి బాలకృష్ణ, పరంధామయ్య, జగదీష్, నమ్మి సింహాద్రి, తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Commentaires