విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి
విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకాన్ని నిలుపేస్తున్నట్లు కేంద్ర మంత్రి వర్గం ప్రకటించాలి, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐటీయూసీ
త్యాగాలు భలిదానాలతో ఏర్పాటు చేసిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విరమించుకోవాలని, ఉక్కు పరిశ్రమ అమ్మకాన్ని నిలుపేస్తున్నట్లు కేంద్ర మంత్రి వర్గం ప్రకటించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఎస్ రాయుడు, పట్టణ కార్యదర్శి సికిందర్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం రాజంపేట బైపాస్ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దహనం చేశారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వివరణ ఇస్తూ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియను నిలుపుదల చేసే ఎలాంటి నిర్ణయం . తీసుకోలేదని స్పష్టం చేసిందని, దాదాపు 700రోజులుగా విశాఖపట్నం లో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నా, రాష్ట్ర మంతటా ఉక్కు ఆందోళనకు సంఘీభావంగా ఆందోళనలు చేపడుతున్నా ప్రజలు, కార్మిక వర్గం చేస్తున్న నిరసనలను ఏమాత్రం లెక్కచేయకుండా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేసి తీరుతామని ప్రకటనలు చేయడం బాధాకరమని, స్టీల్ ప్లాంటు గొంతు నులిమి కేంద్రం హత్య చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ మిన్నకుండడం అన్యాయమని అన్నారు.
రాష్ట్ర ప్రజలను గందరగోళ పరచడానికే పార్లమెంటులో ఒక్కోసారి ఒక్కో ప్రకటన బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదన్నారు. . ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపడానికి రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్షం వేసి కేంద్రంతో పోరాటానికి సిద్ధపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు నాగేశ్వరరావు, బ్రమ్మయ్య, రమణ, వెంకటేష్, సుబ్రహ్మణ్యం, సుబాను, చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Comments