న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి - వీఆర్వో సంఘం
రాజంపేట, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డివిజన్ అధ్యక్షులు భుజంగరావు పేర్కొన్నారు. గురువారం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో వీఆర్వోలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం డివిజన్ అధ్యక్షులు భుజంగరావు మాట్లాడుతూ పని ఒత్తిడి కారణంగా మృతి చెందిన గ్రామ రెవెన్యూ అధికారుల కుటుంబాలకు రూ 25 లక్షలు ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని అన్నారు. సర్వేకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని, నిబంధనలు సడలించి ఒత్తిడి తగ్గించాలని తెలిపారు. వీఆర్ఏ నుండి గ్రేడ్ -2 విఆర్వోలుగా పనిచేస్తున్న 3795 మంది గ్రామ రెవెన్యూ అధికారులను వెంటనే ప్రొఫెషన్ డిక్లేర్ చేసి పే స్కేలు అమలు చేయాలని కోరారు. వీఆర్వోలకు సచివాలయ విధులు ఎక్కువగా ఉన్నందున వారికి కావలసిన కంప్యూటర్ సిస్టం తో పాటు స్టేషనరీ ఏర్పాటు చేయాలని కోరారు. సెలవులు, పండగ దినాలలో పని కల్పించకుండా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. అప్గ్రేడ్ చేసిన పోస్టుల స్థానంలో అర్హులైన వీఆర్వోలను ఎంఆర్ఐ లుగా నియమించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టులను అర్హులైన వీఆర్ఏ లతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డిఓ కోదండరామిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో సంఘం డివిజన్ కార్యదర్శి రాఘవేంద్ర, మల్లికార్జున, సోమశేఖర్ రెడ్డి, బాషా తదితరులు పాల్గొన్నారు.
Комментарии