వై నాట్ బిసి, వై నాట్ మైనారిటీ - ఎమ్మెల్యే వ్యతిరేకవర్గ నాయకుల డిమాండ్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గురువారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అసమ్మతి వర్గం అయిన కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష, భాస్కర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి, అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ తనకే ప్రకటించింది అని ఎమ్మెల్యే రాచమల్లు తనకు తానుగా వెల్లడించుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. అధిష్టానం నుండి ఇంకా అధికారికంగా ఇప్పటివరకు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభ్యర్థి పేరు ఖరారు చేయలేదని, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు టికెట్ విషయమై పునరాలోచన చేసి, అవసరమైతే సర్వే నిర్వహించాలని కోరారు. ఇదిలా ఉండగా నాయకుల, కౌన్సిలర్ల కొనుగోళ్ల వ్యవహారం ఎమ్మెల్యే రాచమల్లుకు కొత్తిమీ కాదని తన పంచాయతీ పరిధిలోని వైసీపీ పార్టీకే చెందిన కొందరు వార్డు మెంబర్లను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు? ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మూడవసారి అభ్యర్థిగా ఈ నెల 15వ తేదీ నుండి నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టనున్న నేపథ్యంలో, అసమ్మతి వర్గం కూడా తాము త్వరలోనే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. అనంతరం కౌన్సిలర్ ఇర్ఫాన్ భాషా మాట్లాడుతూ, వై నాట్ బిసి, వై నాట్ మైనారిటీ అన్న చర్చ నియోజకవర్గ ప్రజలలో జరుగుతున్న సమయంలో, ఎమ్మెల్యే రాచమల్లు అధిష్టానం మరోసారి టికెట్ తనకే కేటాయించిందని వెల్లడించటం సబబు కాదని, అధిష్టాన నిర్ణయం మేరకు అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటిస్తారని గుర్తు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 60 వేల పైచిలుకు ఓట్లు మైనారిటీ ప్రజలవని, మైనారిటీ అభ్యర్థిగా తనను అధిష్టానం ప్రకటిస్తే, మైనారిటీలు తనకు సహకరిస్తే, ఇతరులను కలుపుకొని వెళ్లి వైసీపీకి ప్రొద్దుటూరులో 50వేల ఓట్ల మెజారిటీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Comments