పంచాయతీల్లో రెండున్నరేళ్ల తర్వాత పట్టాలెక్కిన పాలన
కొత్తగా లక్షన్నర మందికి పైగా నాయకత్వ బాధ్యతల్లోకి.
రెండున్నరేళ్ల తర్వాత గ్రామాల్లో ఏప్రిల్ నుంచి తిరిగి సర్పంచుల పాలన మొదలైంది. 1,30,966 మంది వార్డు సభ్యులుగా, 13,097 మంది సర్పంచులుగా కొత్తగా నాయకత్వ బాధ్యతల్లోకి వచ్చారు. ఈ ఏడాదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించగా.. 9,675 మంది ఎంపీటీసీలు, 650 జెడ్పీటీసీలు బాధ్యతలు చేపట్టారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర మందికి పైగా కొత్తగా నాయకత్వ బాధ్యతల్లోకి వచ్చారు. వీరిలో 85 శాతం మంది యువ నాయకత్వమే కావడం గమనార్హం. ఇదే సమయంలో గ్రామీణ పాలనలో ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకొచ్చింది.
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా గ్రామాల్లో గ్రామ కంఠంగా వర్గీకరించిన ప్రాంతంలో ఇళ్లకు తొలిసారి అధికారిక యాజమాన్య పత్రాల జారీ ప్రక్రియను చేపట్టింది. గ్రామాల్లో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా జిల్లా పరిషత్‌లలోనూ రెండో డిప్యూటీ చైర్మన్, మండల పరిషత్‌లలో రెండో ఉపాధ్యక్ష పదవులను కొత్తగా సృష్టించి పంచాయతీరాజ్ చట్టానికి ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. ఇప్పటికే జెడ్పీలో రెండో డిప్యూటీ చైర్మన్ పదవులకు ఎన్నికలు ముగియగా.. మండలాల్లో రెండో ఉపాధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది.
Comments