సింగిల్ ప్లేయర్ గా ఉండాలనే వివేకా హత్య
- వైయస్ సునీత
వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంలో వైసిపి సింగిల్ ప్లేయర్ గా ఉండాలనే దురుద్దేశంతోనే వైయస్ వివేకానంద రెడ్డిని హత్య గావించారని తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ, తనకు తన కుటుంబానికి అలాగే వైయస్ షర్మిల కుటుంబానికి ముప్పు పొంచివుందని, అయినా న్యాయం కోసం ధైర్యంగా పోరాడుతున్నట్లు, తన తల్లి పసుపు కుంకుమలు తీసిన నిందితులను లింగాల మండల ప్రజలు ఎన్నడూ క్షమించరని, వారికి ఓట్లు వేయరని వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ వైయస్ సునీత ప్రొద్దుటూరు పట్టణంలోని కొవ్వూరు గ్రాండ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికలకు మరో మూడు రోజులు ఉన్న నేపథ్యంలో వైసిపి ప్రశ్నలకు సందేహాలకు సమాధానమివ్వవలసిన బాధ్యత తనకు ఉందని, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో కడప ఎంపీ స్థానం ప్రత్యేకమని ఇక్కడి ఎన్నిక న్యాయానికి నిందితులకు మధ్య జరుగుతున్న పోటీగా ఆమె అభివర్ణిస్తూ, తమది న్యాయపోరాటమని, ఈ పోరాటంలో ప్రజలే నిర్ణయేతలు అని ఆమె అన్నారు.
రాష్ట్రంలోనే కాక భారతదేశ చూపు కడప పార్లమెంటు ఎన్నికల వైపు ఉందని, ఇలాంటి నేపథ్యంలో తన తండ్రి హత్య తర్వాత న్యాయపోరాటం చేస్తున్న తనకు, న్యాయాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలకు ఉందని ఆమె అన్నారు. వైయస్ఆర్సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి నిర్దోషి అని జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె తీవ్రంగా స్పందించారు. జగన్ న్యాయ నిర్మేతగా వ్యవహరిస్తున్నారని అందుకు సిబిఐ కోర్టులు ఉన్నాయని ఆమె హితువు పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ధర్మం వైపు నిలవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని, చెల్లెళ్లకు న్యాయం జరగాలని జగన్ ఏనాడు ఆలోచన చేయలేదని ఆమె అన్నారు. వివేక హత్య జరిగి ఐదు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ నిందితులకు శిక్ష పడలేదని, ప్రజా శ్రేయస్సు కోరి రానున్న రోజుల్లో ఇలాంటి హత్యలు జరగకూడదనే ఆలోచనతో తాను చేస్తున్న ఈ న్యాయ పోరాటాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.
గత కొద్దిరోజుల క్రితం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను సిబిఐ ని ప్రభావితం చేస్తున్నానని అనటం హాస్యాస్పదమని, సాధారణ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న తాను ఏ విధంగా సిబిఐ ని ప్రోత్బలం చేయగలనని ఆమె ప్రశ్నించారు? న్యాయం కోసం చేస్తున్న ఈ పోరాటంలో తాను రాజకీయాలలోకి రావాలని ఏనాడు అనుకోలేదని, నిందితులను కాపాడాలని చూస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పినతండ్రిలా కాకుండా ఒక సాధారణ వ్యక్తికి జరిగిన అన్యాయంగా మనిషిగా గుర్తించి వివేకా హత్యకు కారకులైన వారికి శిక్షపడేలా జగన్ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, పార్టీలకు అతీతంగా తాను న్యాయం కోసం చేపట్టిన ఈ పోరాటంలో విజయమ్మ కూడా తనకు ధైర్యం చెప్పి అండగా నిలిచిందని అన్నారు. వైయస్ షర్మిలను ఎంపీ చేయాలని తన తండ్రి వైయస్ వివేకానంద రెడ్డి కలలు కన్నారని, న్యాయం వైపు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్ షర్మిలను ఆదరించి ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Commenti