అసమ్మతినేతల ప్రచారం ప్రారంభం
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు వైసీపీలో అసమతి సెగలు తారాస్థాయికి చేరాయి, మాకు అంటే కాదు మాకే అంటూ టికెట్ తమకు తామే వెళ్ళడించుకుంటున్నారు, మూడోసారి ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసిపి టికెట్ తనకే దక్కిందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడించి, ఈనెల 15వ తేదీన ప్రచారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో, ఆయన అసమ్మతి వర్గమైన కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, మునిసిపల్ వార్డు కౌన్సిలర్లు ఇర్ఫాన్, వంగనూరు మురళీధర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్, పలువురు వైసిపి నాయకులు అభ్యర్థి టికెట్ ఖరారు విషయంలో తిరుగుబావుట ఎగురవేసిన విషయం విధితమే. ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీ నందు వైసీపీ యువ నాయకుడు సుమంత్ ఆధ్వర్యంలో అసమ్మతి నేతలు పార్టీ ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా వివేకానంద నగర్ కు విచ్చేసిన అసమ్మతి నేతలకు అక్కడి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పూల వర్షం కురిపిస్తూ, బాణాసంచా పేలుస్తూ, గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం వారు ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి, అందిన లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాచమల్లు అవినీతిపరుడు అని, అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని తమ పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకున్నారని, తాను గెలిపించుకున్న 17 మంది వార్డు మెంబర్ లలో దాదాపు 11 మంది వార్డ్ మెంబర్లకు కొనుగోలు చేసి పంచాయతీ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో తాము ఎమ్మెల్యే అభ్యర్థిగా రాచమల్లు అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తున్నామని, అధిష్టానం పునరాలోచన చేసి గెలుపు గుర్రానికి టికెట్ ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే రాచమల్లు ను ఎమ్మెల్యే అభ్యర్థిగా తాము అంగీకరించబోమని, తనకు సీటు కేటాయిస్తే దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో ప్రొద్దుటూరు వైసీపీ స్థానాన్ని కైవసం చేసుకొని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, తాము వైసీపీ రెబెల్ అభ్యర్థులము కాదని, ఎంపీ అవినాష్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ, రానున్న ఎన్నికలలో ఆయన గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తామని, రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారంలోకి రానున్నదని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో యువ నాయకుడు దుగ్గిరెడ్డి రఘునాథ్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వివేకానంద నగర్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
Comments