జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ..
కేంద్రానికి ఏపీ ఇంటలిజెన్స్ లేఖ!
ఏపీ సీఎం జగన్ కు ఐసిస్, ఐఎస్ఐ ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఆయనకు భద్రత కల్పించడం రాష్ట్ర పోలీసుల వల్ల కాదన్న అభిప్రాయానికి వచ్చారు. కేంద్రానికి లేఖ రాశారు. జగన్‌కూ జడ్ ప్లస్ సెక్యూరి్టీ కల్పించాలని అందులో కోరారు. ఏ ప్రాతిపదికన జగన్ కు .. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందో లేదో తెలియదు కానీ.. ఏపీ ఇంటలిజెన్స్ పోలీసుల తీరు మాత్రం ఢిల్లీలో నవ్వుల పాలయింది.
కేంద్రానికి అత్యున్నత స్థాయి ఇంటలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కూడా వారికి ఉంటుంది. దేశంలో ఎవరికి ముప్పు ఉంది.. దేశానికి ఎవరు ముప్పు అని వారు ఎప్పటికప్పుడు అసెస్‌మెంట్ చేస్తూనే ఉంటారు. రాష్ట్రాల ఇంటలిజెన్స్ లకు ఉండేది చాలా పరిమితమైన వనరులు. ఇంటలిజెన్స్ చేసేదంతా రాజకీయ నాయకులపైనే.. ప్రత్యర్థులపైనే కాదు. సొంత పార్టీ నేతల ఫోన్లూ ట్యాప్ చేస్తూంటారు. సర్వేలు చేసుకోవడం.. ఇతరులపై నిఘా పెట్టడానికే పరిమితమవుతుంది. మరి సీఎంకు ఉగ్రవాదుల ముప్పు ఎక్కడ ఉందో ?
ఇటీవలి కాలంలో సీఎం భద్రత పేరుతో చేస్తున్న అతి తీవ్ర విమర్శల పాలవుతోంది. ఎక్కడిక్కకడ చెట్లు కొట్టేస్తున్నారు. డివైడర్లను తీసేస్తున్నారు. జగన్ వస్తున్నారంటే.. ఆ ఊరి ప్రజలు బాబోయ్ అనుకునే పరిస్థితి. ఇంత అతి చేస్తోంది.. ఆయనకు ముప్పు ఉందని చెప్పి జడ్ ప్లస్ సెక్యూరిటీకి సిఫారసు చేయడానికా అన్న సందేహాలు ఇతరుల్లో వస్తున్నాయి. జగన్ కు ఇప్పుడు ఉన్న భద్రత కారణంగా కిలోమీటర్ వరకూ ఆయన అనుకున్న వారు తప్ప ఇతరులు ఉండే అవకాశం లేదు. ఆయన ఇళ్లు అధికారంలోకి వచ్చినప్పటి నుండి 144 సెక్షన్ కిందనే ఉంటుంది. ఏపీ ఇంటలిజెన్స్ లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అత్యున్నత స్థాయి ముప్పు ఉందని నివేదికలు ఉంటేనే జడ్ ప్లస్ భద్రత కల్పిస్తారు. సీఎంలలో యోగి ఆదిత్యనాథ్, అరవింద్ కేజ్రీవాల్ లకు మాత్రమే జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. ఇతర బీజేపీ సీఎంలకూ కల్పించలేదు.
Comentarios