బహుజనుల ధర్మ పోరాట సభ విజయవంతం
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిందని, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొత్తులు, మేనిఫెస్టో ల గురించి చర్చలు జోరందుకోగా, ప్రధాన రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయని భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక టీటీడీ కళ్యాణమండపం నందు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కరుణాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన బహుజనుల ధర్మ పోరాట సభకు ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఏ పార్టీ కూడా రైతులకు న్యాయం చేయలేదని, యువతకు విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, మహిళా సాధికారత దిశగా వారికి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన దాఖలాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. మోసపూరిత మాటలతో మభ్యపెట్టి ఓట్లు దండుకుంటున్నారే తప్ప బహుజనులకు తగిన న్యాయం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం ఆ పార్టీ ప్రొద్దుటూరు అభ్యర్థి కరుణాకర్ యాదవ్ మాట్లాడుతూ, గడచిన దశాబ్ద కాలంగా తాను జర్నలిస్టుగా పనిచేస్తుండగా, రాజకీయాలు నచ్చని తాను రాజకీయాల వైపు దృష్టి సారించేలా అగ్రకులాల ఆధిపత్యం తన దృష్టిని రాజకీయాల వైపు మళ్ళించాయని, రానున్న రోజుల్లో అగ్రవర్ణాల పెత్తనం ఇక చెల్లదని, బహుజనులకు పెద్దపీట వేసి అధికార దిశగా అడుగులు వేస్తామని ఆయన అన్నారు. గతంలో తాను బీసీలకు కుర్చీలపై అగ్రవర్ణాల పెత్తనం బ్యానర్ వేసినందుకు బెదిరింపులు కూడా వచ్చాయని, తనపై తప్పుడు కేసులు బనాయించాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని, తప్పుడు కేసులు తనపై నమోదు చేసిన అధికారి కోర్టు మెట్లు ఎక్కక తప్పదని హెచ్చరించారు. ఇలాంటి సందర్భంలోనే తాను రాజకీయాల వైపు అడుగులు వేయవలసి వచ్చిందని, పూలే, అంబేద్కర్ కలలుకన్న రాజ్యం కావాలని ఆకాంక్షిస్తూ, అగ్రవర్ణ కులాలైన కమ్మ రెడ్లు ఒకవైపు ఉండి ఎస్సీ ఎస్టీ బీసీలు మరోవైపున అధికారం కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఆయన అభిప్రాయపడుతూ, కులగనన చేసి ప్రధాన పార్టీలు ఇప్పటికైనా సీట్లు కేటాయించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాజంపేట ఇంచార్జ్ ఆకుల నరసయ్య, పలువురు పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Comments