విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వండి -
సీబీఐ కోర్టును కోరిన జగన్, విజయసాయిరెడ్డి..
పీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనలకు సిద్దమవుతున్నారు. ఇద్దరూ వేర్వేరుగా విదేశీ పర్యటనలు చేయబోతున్నారు. వ్యక్తిగత పనుల కోసం ఈ పర్యటనలు చేయనున్నారు..
ఇందుకోసం హైదరాబాద్ సీబీఐ కోర్టును అనుమతి కోరారు. దీనిపై సీబీఐ అభిప్రాయం తీసుకున్న తర్వాత సీబీఐ కోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. సీబీఐ అభ్యంతరాలు చెప్పకపోతే మాత్రం విదేశీ టూర్లు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతిస్తుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకూ యూరప్ టూర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా లండన్ లో చదువుకుంటున్న కుమార్తె వద్దకు కూడా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ తేదీల్లో విదేశీ పర్యటన చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కోర్టు సీబీఐ అభిప్రాయం కోరింది. సీబీఐ అంగీకరిస్తే కోర్టు నిర్ణయం తీసుకుంటుంది..
అలాగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాబోయే ఆరు నెలల్లో విదేశీ పర్యటనలు చేయాల్సి ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తెచ్చారు. పలు యూనివర్శిటీలతో ఒప్పందాల కోసం అమెరికా, యూకే, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లాల్సి ఉందని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో విజయసాయిరెడ్డి తెలిపారు. వీటి కోసం ఆరు నెలల్లో 30 రోజుల పాటు తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును సాయిరెడ్డి కోరారు. దీనిపైనా సీబీఐ అభిప్రాయం తెలుసుకున్నాక కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
గతంలో జగన్ అక్రమాస్తులకేసులో జగన్ తో పాటు విజయసాయిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ కోర్టు పలు షరతులు విధించింది. ఇందులో కోర్టు ముందస్తు అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లరాదనే షరతు కూడా ఉంది. ఈ మేరకు వీరిద్దరూ విదేశీ పర్యటనలకు అనుమతి కోరారు. గతంలోనూ సాయిరెడ్డి ఓసారి కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు తాజాగా వీరిద్దరూ దాఖలు చేసుకున్న పిటిషన్లపై స్పందించేందుకు సీబీఐ గడువు కోరడంతో విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది.
Comments